విలాసవంతమైన భవనంలో పనిచేస్తున్న ఓ నిర్మాణ కార్మికుడికి కనీస సౌకర్యం కూడా అందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవనంలో నాలుగు లిఫ్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఓ కూలీకి వాటిని ఉపయోగించేందుకు అనుమతించకపోవడంతో రెండు భారీ కాంక్రీట్ దిమ్మలను తలపై మోసుకుంటూ 21వ అంతస్తు వరకు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను తొలుత డింప్స్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో ఆయన ప్రొఫైల్లో కనిపించడం లేదు.