సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో దివంగత నటి శ్రీదేవి పేరు ఎప్పటికీ ముందువరుసలో ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. బాలనటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా కూడా శ్రీదేవి రికార్డు సృష్టించారు. 2018లో 54 ఏళ్ల వయసులో శ్రీదేవి అనూహ్యంగా కన్నుమూయడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆమె మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటుగానే మిగిలిపోయింది.