టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపికబురు. నగరంలో నాలుగు భారీ బస్టాండ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు శివారు ప్రాంతాల్లోని ఈ టెర్మినళ్ల నుంచే రాకపోకలు సాగించనున్నాయి. దీని వల్ల నగరంలోని ఇతర బస్టాండ్లపై ఒత్తిడి తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించే దిశగా టీజీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది. మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లో మరో నాలుగు భారీ బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్ మాత్రమే పెద్ద టెర్మినల్స్ ఉన్నాయి.